నేడు సిద్ధిపేట జిల్లాలో పంజాబ్ సీఎం పర్యటన

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్.. భగవంత్ సింగ్, ఆయన బృందానికి వివరించనున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం, ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్కూక్‌లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ను మొదట సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేటల మధ్య ప్రవహించే కూడవెల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శిస్తారు. పాండవుల చెరువు వద్ద రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చింది. ఆయనతో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్లు కూడా వచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, అధికారులు పరిశీలించనున్నారు.

Related Articles