తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాలంటూ ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకుని అర్ధనగ్నంగఆ డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్ జిల్లా దుగ్గండి మండలం పొనకల్‌కి చెందిన గట్ల సురేందర్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలున్నాయి. ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. అయితే పెద్దమనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయానికి నడుచుకుంటూ బయలుదేరారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ వచ్చానని సురేందర్ అన్నారు.