అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు కూడా భారత్ వశమైంది. తొలి టెస్టు మాదిరే ఈ మ్యాచ్‌ను కూడా రెండున్నర రోజుల్లోనే ముగించడం రోహిత్ సేన ఆధిపత్యాన్ని చూపినట్టయింది. స్పిన్నర్ రవీంద్ర జడేజా (7/42), అశ్విన్ (3/59) ఆసీస్ పతనాన్ని శాసించారు. దీంతో రెండో టెస్టులో భారత్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. నాలుగు టెస్టుల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భారత్ 2-0 ఆధిక్యంతో ఉంది. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 31.1 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. హెడ్ (43), లబుషేన్ (35) మాత్రమే రాణించారు. ఆ తర్వాత భారత్ 115 పరుగుల లక్ష్యం కోసం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 26.4 ఓవర్లలో 118/4 స్కోరుతో ముగించింది. రోహిత్ (31), పుజార (31 నాటౌట్), భరత్ (23 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లియోన్‌కు రెండు వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 (3+7) వికెట్లు తీసిన జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 263, భారత్ 262 పరుగులు చేశాయి.