నేటి నుంచి ఆఖరి టెస్టు

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాలని చూస్తున్నది. మూడో టెస్టు విజయం ద్వారా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న కంగారూలు అదే ఊపు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. స్పిన్నర్ల ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతున్న వేళ గత మూడు టెస్టులు మూడు రోజుల్లోపే ముగిసిన నేపథ్యంలో అహ్మదాబాద్‌ టెస్టుపై మరింత ఆసక్తి నెలకొన్నది. తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్న నేపథ్యంలో మరోమారు వికెట్ల వేట దిగ్విజయంగా కొనసాగనుంది. ఆఖరి టెస్టు కోసం రెండు పిచ్‌లను సిద్ధం చేయగా కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌కే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే పిచ్‌ను పరిశీలించిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముందని వ్యాఖ్యానించాడు. మొత్తంగా బ్యాటర్లు, స్పిన్నర్ల మధ్య ఆసక్తికర పోరుకు అవకాశముంది.

Related Articles