టీడీపీ నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు. చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించారని ఆమె ఆరోపించారు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డపేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణవార్త ప్రకటించి ఉండాల్సిందన్న లక్ష్మీపార్వతి.. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని ఆరోపించారు. తండ్రీకొడుకులు రాష్ర్టానికే అపశకునం అని ప్రజలకు భావిస్తున్నారని చెప్పారు. తారకరత్న భార్యాబిడ్డలను, తల్లి దండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.