నేడు భారత్‌, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ పోరు..

భారీ ఆశలతో ప్రపంచకప్‌ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అసలు సిసలు పోటీకి సిద్ధమైంది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గత టీ20 వరల్డ్‌కప్‌, కామన్వెల్త్‌ క్రీడల ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్‌సేనకు బదులు తీర్చుకొనేందుకిది సువర్ణావకాశం. కానీ, అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్‌ను ఎదుర్కోవాలంటే టీమిండియా సర్వశక్తులూ ఒడ్డాల్సిందే. టాపార్డర్‌లో నిలకడ లేమితోపాటు స్ట్రయిక్‌ రొటేట్‌ చేయలేక పోవడం జట్టును కలవర పెడుతోంది. రిచా మినహా మిగతా వారు ఎవరూ భారీ షాట్లు ఆడలేక పోతుండగా.. డాట్‌ బాల్స్‌ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఓపెనర్‌ షఫాలీ గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌ కూడా జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే.. ఆమె సారథ్యం ముగిసినట్టే..! జెమీమా రోడ్రిగ్స్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. జట్టు అవసరాల మేరకు ఇంకా రాణించాల్సింది ఉంది. అయితే, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన నిలకడగా ఆడుతుండడం జట్టుకు సానుకూల పరిణామం. బౌలింగ్‌లో పేసర్‌ రేణుక సింగ్‌ సత్తాచాటుతున్నా.. ఆమెకు తగిన సహకారం కరువైంది. స్పిన్నర్‌ దీప్తి శర్మ గత కొన్ని మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చుకోవడం జట్టుకు ఇబ్బందిగా మారింది. మరోవైపు గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మెగ్‌ లానింగ్‌ సేనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఏడుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మొత్తంగా చూస్తే ఆసీస్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

Related Articles