గెలుపు ముంగిట భారత్‌ బోల్తా

మహిళల టీ20 ప్రపంచ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. గురువారం టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో టీమ్‌ఇండియా 5 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కంగారూల చేతిలో పరాజయం కంటే.. ఒత్తిడి చేతిలో మనవాళ్లు చిత్తయ్యారనడం సబబు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. అలీసా హీలీ (25), ఆష్లే గార్డ్‌నర్‌ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) కూడా రాణించడంతో ఆసీస్‌ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, దీప్తి శర్మ, రాధ యాదవ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. టోర్నీ ఆసాంతం రాణించిన పేసర్‌ రేణుక సింగ్‌ కీలక పోరులో భారీగా పరుగులు సమర్పించుకోవడం భారత్‌ కొంపముంచింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హర్మన్‌ప్రీత్‌ బృందం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్‌ హర్మన్‌ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీతో పోరాడగా.. రోడ్రిగ్స్‌ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు కంగారూలను చితక్కొట్టింది. చివర్లో దీప్తి శర్మ (20 నాటౌట్‌; 2 ఫోర్లు) పోరాటం కొనసాగించినా.. భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌, డారిక్‌ బ్రౌన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కగా.. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది.

Related Articles