మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత ఆస్ట్రేలియా..

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్‌గా ఆస్ట్రేలియా అవ‌త‌రించింది. ఆరోసారి పొట్టి ప్రపంచ‌క‌ప్ ఎగ‌రేసుకుపోయింది. 2018, 2020లోనూ ఆ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్‌; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ అర్ధశతకంతో అలరించగా.. గార్డ్‌నర్‌ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ (18; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నమ్‌ ఇస్మాయిల్‌, మరీనే కాప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. లారా వాల్‌వార్ట్‌ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టినా.. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో దక్షిణాఫ్రికాకు పరాజయం తప్పలేదు. తొలిసారి మెగాటోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బెత్‌ మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

Related Articles