సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే బస్సులో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంపులగ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. దీంతో సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. అయితే నిలిచిపోయిన బస్సును రిపేర్ చేయడానికి సిబ్బంది మరో బస్సులో వచ్చారు. ఈ క్రమంలో ఆగిపోయిన బస్సులో ఉన్న బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు వేగంగా మంటలు వ్యాపించడంతో రెండూ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.