పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత..

కాకతీయ మెడికల్‌ కాలేజీలో సీనియర్‌ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మృతి నేపథ్యంలో నిమ్స్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థిని కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) ఫస్టియర్‌ చదువుతున్నది. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఈ నెల 22న ఆమె హానికరమైన ఇంజెక్షన్‌ చేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.

Related Articles