మార్చి 7వ తేదీకల్లా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు. మార్చి 10న అన్ని రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ ప్రధాన కమిషనర్ వెల్లడించారు.ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. మణిపూర్‌లో రెండు దశల్లో, యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
14న ఎన్నికల తొలి నోటిఫికేషన్
అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 14న యూపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈనెల 15వ తేదీ వరకు ఎన్నికలు జరుగనున్న అయిదు రాష్ట్రాల్లో ఎలాంటి రోడ్ షోలు, సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేశారు.నామినేషన్ యాత్రలకు కూడా అనుమతి లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు. జనవరి 15న పరిస్థితి చూసి తరువాతి ప్రకటన చేస్తామని అన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ సుశీల్ చంద్ర వెల్లడిస్తూ ఈ విషయాలను వెల్లడించారు. తక్షణమే అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు వంద నిమిషాల్లో స్పందిస్తారని చెప్పారు.
ఏడు దశల్లో ఇలా పోలింగ్ జరుగుతుంది.
1వ దశ: 10 ఫిబ్రవరి (యూపీ)
2వ దశ: 14 ఫిబ్రవరి (యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా)
3వ దశ: 20 ఫిబ్రవరి (యూపీ)
4వ దశ: 23 ఫిబ్రవరి (యూపీ)
5వ దశ: 27 ఫిబ్రవరి (యూపీ, మణిపూర్)
6వ దశ: మార్చి 3 (యూపీ, మణిపూర్)
7వ దశ: మార్చి 7 (యూపీ)