కడప స్టీల్‌కు నేడు మళ్లీ భూమి పూజ

వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం మళ్లీ భూమి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ రూ.8800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మొదటి విడతలో రూ.3300 కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనుంది. సీఎం హోదాలో జగన్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద 2019 డిసెంబరు 23న ఏపీ హైగ్రేడ్‌ స్టీలు ప్లాంటు శంకుస్థాపనకు టెంకాయ కొట్టారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని నాడు యువతకు హామీ ఇచ్చారు. అయితే, జగన్‌ స్టీలు ఫ్యాక్టరీ కోసం ఏ ముహూర్తాన టెంకాయ కొట్టారో కానీ, అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేవలం ప్రహరీ గోడ ఇతర పనులు మాత్రమే కొంతమేర అయ్యాయి. ప్లాంటుకు అవసరమైన నిర్మాణ పనులేవీ ముందుకుపోలేదు. పొలిటికల్‌ ఇమేజ్‌ కోసం స్టీలు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామంటూ హడావుడిగా శంకుస్థాపన చేశారు. గడిచిన మూడేళ్లలో మూడు సంస్థలు మారాయి. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో స్టీలు ఫ్యాక్టరీ నిర్మించాలనుకున్నారు. తొలుత లిబర్టీ కంపెనీ ఆసక్తి చూపింది. 2021 ఫిబ్రవరి 22న సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో లిబర్టీకి ఆమోదముద్ర వేశారు. తొలివిడతలో రూ.1,082 కోట్లు, రెండో విడతలో రూ.ఆరువేల కోట్లతో నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆ సంస్థకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతోపాటు మరికొన్ని కారణాలతో ఒప్పందం రద్దయింది. దీంతో టెండర్లలో ఎల్‌-2గా నిలిచిన ఎస్‌ఆర్‌ స్టీలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదీ అటకెక్కింది. ఇప్పుడు ముచ్చటగా జేఎస్‌డబ్ల్యూవోకు అప్పగించారు. రూ.8,880 కోట్లతో నిర్మిస్తామన్నారు. రెండు దశల్లో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్ల క్రితం శంకుస్థాపన సందర్భంగా రూ.15వేల కోట్లతో 25వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తామని చెప్పడం ఇక్కడ గమనార్హం. అయితే ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూవో సంస్థ వద్దకు వచ్చేప్పటికి వ్యయం తగ్గిపోయింది.

Related Articles