తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువ జామునుంచి భక్తజనం దేవాలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీగిరి క్షేత్రం శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, రావివలస, మహేంద్రగిరి, రామతీర్థం, నర్సీపట్నం, వేములవాడ, కీసర తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. హరహర మహాదేవ శంభోశంకర, శివోహం అంటూ భక్తులు పరమశివున్ని స్మరిస్తున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో శుక్రవారం నుంచే వేడుకలు మొదలయ్యాయి. ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వామివారికి శనివారం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ నిర్వాహకులు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేములవాడ తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి ఆలయానికి చేరుకునేందుకు భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజనం, మంచి నీటీ సదుపాయాలు కల్పించారు.

Related Articles