మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కురవి మండలం మోదుగులగూడెంలో ఊయలలో పడుకోబెట్టిన పసికందుపై వానరమూక దాడి చేసింది. ఆ దాడిలో చిన్నారి కాలి బొటన వేలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు నెలన్నర వయస్సున్న పాప ఉంది. లావణ్య ప్రసవానికి పుట్టిల్లు అయిన మోదుగులగూడెం వచ్చి అక్కడే ఉంటున్నారు. బుధవారం సాయంత్రం చిన్నారిని ఇంటి ఆవరణలోని ఊయలలో పడుకోబెట్టిన లావణ్య.. మంచినీళ్ల కోసమని ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో గుంపులు గుంపులుగా వచ్చిన కోతులు ఒక్కసారిగా ఊయలలో నిద్రిస్తున్న పాపపై దాడి చేశాయి. కోతుల దాడితో పసికందు ఏడ్వగా.. ఏం జరిగిందోనని తల్లి లావణ్య పరుగు పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కోతుల దాడి చేయటాన్ని చూసి ఆందోళనకు గురైన ఆమె.. కర్రతో వాటిని తరిమేశారు. అప్పటికే కోతులు చిన్నారి కాలిబొటన వేలును కొరికేశాయి. వెంటనే చిన్నారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు.