జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ‘ఢిల్లీ చలో’ ప్రభావం

ఉదయం నుంచి ఢిల్లీలో సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఒక మోస్తరుగా ఉన్న రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఇతర రైతులు మాదిరి కాకుండా పంజాబ్‌ రైతులు చాలా పట్టుదలతో ఢిల్లీలో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఎన్నాళ్ళయినా ఢిల్లీలో తిష్ట వేస్తామని బాహాటంగా చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం కూడా రైతులను నిలువరించలేకపోయింది. రోడ్లకు అడ్డంగా వేసిన బారికేడ్స్‌ను తొలగించిన రైతులు.. అనేక చోట్ల తమ సోదరు రైతుల ట్రాక్టర్లకు అడ్డంగా ప్రభుత్వం వేసిన ఇసుకను స్థానికులు తొలగించడంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. స్థానికుల నుంచి రైతులకు మద్దతు అందడం… రైతు పాదయాత్రకు అనుగుణంగా ప్రతి చోట్ల భోజన ఏర్పాట్లతో ‘లంగర్‌’ ఏర్పాటు చేయడంతో…రైతులు పెద్ద ఇబ్బంది లేకుండా ఢిల్లీ సరిహద్దులోకి వచ్చేశారు. ఇపుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఢిల్లీ- హర్యానా, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో రైతులపై పోలీసుల భారీ ఎత్తున భాష్ప వాయు గోళాలను ఉపయోగిస్తున్నారు. వాటర్‌ క్యానన్లు వాడుతున్నారు. అయినా వారిని నిలువరించలేకపోతున్నారు. రైతులను బందీలుగా ఉంచేందకు ఢిల్లీలోని 9 స్టేడియంలను తమకు అప్పగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరారు. చూస్తుంటే రైతు పోరాటం తొందరగా ముగిసేలా లేదు. ఇన్నాళ్ళూ ఈ ఉద్యమాన్ని చూపకుండా ఆపిన.. జాతీయ మీడియాకు ఇపుడు… లైవ్‌ టెలికాస్ట్‌ ఇవ్వక తప్పడం లేదు. వీడియోలు సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. రైతులపై జరుగుతున్న ఈ దాడిని దేశమంతా చూస్తోంది. ఇవాళ్టి నుంచి ప్రాంతీయ ఛానల్స్‌ కూడా ఢిల్లీ రైతు పోరాటం ప్రసారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

ఎన్నికలపై ప్రభావం
రైతు ఉద్యమాన్ని వెంటనే మోడీ ప్రభుత్వం ఫుల్‌ స్టాప్‌ పెట్టకపోతే… దీని ప్రభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కచ్చితంగా ఉండే ప్రమాదముంది. ఇతర రైతులకు భిన్నంగా ఉంటోంది పంజాబ్‌ రైతుల పోరాటం. చదువుకున్న రైతు బిడ్డలు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి ఓ రైతుబిడ్డ ఇంగ్లిషులో… పోలీసు అధికారులను నిలదీస్తున్న విజువల్స్‌ వైరల్‌ అవుతున్నారు. భాష్ప వాయువును ఉపయోగించిన దృశ్యాలు మోడీ ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని తెలుగు మీడియా ఒకస్థాయి వరకు మాత్రమే ఆపగలదేమో… పరిస్థితి చేయిదాటితే … బీజేపీకి ఇబ్బందిక పరిస్థితి తేవడం ఖాయంగా కన్పిస్తోంది

బీజేపీ పొరపాటు
స్థానిక ఎన్నికలను స్తానిక నేతలకే పరిమితం చేయకుండా జాతీయ నాయకులు సైతం రంగంలోకి దిగడంతో టీఆర్‌ఎస్‌ కూడా ఇపుడు మోడీ జాతీయ విధానాలను ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు రైతు ఉద్యమంపై మిన్నకుండి పోయిన… టీఆర్‌ఎస్‌ ఇపుడు తన ఎన్నికల్లో రైతు ఉద్యమాన్ని ప్రస్తావించడం ఖాయంగా కన్పిస్తోంది. ఢిల్లీలో రైతులపై పోలీసుల జులుంను ఇక ప్రభుత్వం అనుకూల మీడియా ప్రసారం చేయడం ప్రారంభించడం ఖాయం. ఈ నేపథ్యంలో రైతు కుటుంబాలపై ‘చలో ఢిల్లీ’ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీలో పరిస్థితి ఏమాత్రం అదుపు తప్పినా… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి తలనొప్పిగా మారడం ఖాయం.

 

 

 

Related Articles