ట్రాఫిక్ సిగ్నల్ వ‌ద్ద భారీ దోపిడీ..

ఢిల్లీలో భారీ చోరీ జ‌రిగింది. ట్రాఫిక్ సిగ్నల్ ప‌డగానే ఆగిన ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడి బ్యాగులో నుంచి రూ. 40 ల‌క్షలు మాయం చేశారు దొంగ‌లు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని ఎర్రకోట వ‌ద్ద మార్చి 1న సాయంత్రం స‌మ‌యంలో చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువ‌కుడు.. రూ. 40 ల‌క్ష‌ల న‌గ‌దు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే భారీగా న‌గ‌దు తీసుకొని వెళ్తున్న ఆ యువ‌కుడిని ఓ ముగ్గురు యువ‌కులు అనుస‌రించారు. ఎర్రకోట వ‌ద్ద సిగ్న‌ల్ ప‌డ‌గానే.. బైక్‌ను ఫాలో అయిన ఆ ముగ్గురు క్షణాల్లోనే రూ. 40 ల‌క్ష‌ల న‌గదును కొట్టేశారు. ఒక‌రేమో బ్యాగు జిప్‌ను తీయ‌గా, మ‌రో యువ‌కుడు డ‌బ్బును క్షణాల్లో త‌న చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ యువ‌కుడు మూడో వ్యక్తికి డ‌బ్బు అంద‌జేయ‌గా, అక్కడ్నుంచి జారుకున్నాడు. అయితే సిగ్నల్ వ‌ద్ద ఇత‌ర వాహ‌న‌దారులు ఉన్నప్పటికీ, ఈ చోరీ ఘ‌ట‌న‌ను గ‌మనించ‌లేదు. త‌న గ‌మ్యస్థానానికి చేరుకున్న ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు బ్యాగు తెరిచి చూడ‌గా, న‌గ‌దు మాయ‌మైంది. దీంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎర్రకోట వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ముగ్గురిలో ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆకాశ్‌, అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 38 ల‌క్షల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Related Articles