కేరళ కేసులో సుప్రీం తీర్పు ఏమిటి?

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేంత వరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర హైకోర్టు సదరు వాదనను తిరస్కరించడంతో సుప్రీంలో సవాలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా ఇదే విధమైన పిటీషన్‌ వేసింది. ఇదే కారణంతో ఉద్యోగులూ పిటీషన్‌ వేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల వ్యాక్సినేషన్‌ పూర్తవదు. తొలి దశలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు వేస్తున్నారు. ఇదే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. 50 శాతం మంది కూడా వేసుకోలేదు. మరి రెండో దశలో కూడా 50 ఏళ్ళ పైబడినవారికి అని ప్రభుత్వం అంటోందేకాని… ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగుల కోసం రెండోదశ అని అనడం లేదు. అంటే 50 ఏళ్ళలోపు వయసు ఉన్న ఉద్యోగులకు రెండో దశలోనూ టీకా అందదు. అసలు రెండో దశ ఎపుడు ప్రారంభిస్తారో కేంద్ర క్లారిటీ ఇవ్వలేదు. ఈ దశలో రేపు సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ పిటీషన్ విచారణకు రానుంది. ఈ సమయంలో విపక్షాలతో పాటు ఎస్‌ఈసీని సమర్థించే వర్గం పదే పదే కేరళ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రెండు కారణాలతో రెండు పిటీషన్లు వేశారు.
మొదటి పిటీషన్‌ ఎమ్మెల్యేది…
ఇపుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వాదనతోనే కేరళకు చెందిన ఎమ్మెల్యే పీసీ జార్జి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సుప్రీంని ఆశ్రయించారు. అప్పటికి కేరళలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ రాలేదు. నోటిఫికేషన్‌కు ఒక ముందు రోజు పిటీషన్‌ వేశారు జార్జి. కేంద్రం చేసిన సవరణల కారణంగా 65 ఏళ్ళ పైబడినవారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయొచ్చని చెప్పారని, ఆ విధమైన ఏర్పాట్ల తరవాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని ఎమ్మెల్యే జార్జి పేర్కొన్నారు. అపుడు రాష్ట్రంలో రోజూ 5000కు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. నిజానికి ఇదే కారణంతో అంటే రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయన వాదనను కొట్టేసింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అధ్యక్షతన గల బెంచ్‌ ఎమ్మెల్యే వాదనను తోసిపుచ్చింది. తాను ఎన్నికల వాయదా కోరడం లేదని అంటూనే…కేంద్రం కొత్త సవరణలను ఎన్నికల సంఘం పాటించడం లేదన్న వాదనను బెంచ్‌ అంగీకరించలేదు. ఇది జరిగింది డిసెంబర్‌ 7న. దీంతో కేరళలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయినా మరో పిటీషనర్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఇదేనెల 24వ తేదీన జస్టిస్‌ ఇందిరా బెనర్జి, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు ఈ పిటీషన్‌ విచారణకు వచ్చింది. రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పాటించలేదని పిటీషనర్‌ తన పిటీషన్‌లో ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, మధ్యలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేస్తూ బెంచ్‌ సదరు పిటీషన్‌ను కొట్టేసింది.
రేపు కేసు కీలకం…
ఏపీ కేసు చాలా కీలకంగా మారనుంది. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులను పేర్కొంటూ వచ్చిన పిటీషన్లను కోర్టులు తోసిపుచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ కారణంతో వేసిన పిటీషన్లకు నో చెప్పాయి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కాబట్టి జోక్యం చేసుకోమని కూడా కేరళ స్థానిక ఎన్నికలకు సంబంధించి తీర్పులు వచ్చాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముందే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా ఆపితే… కచ్చితంగా పశ్చిమ బెంగాల్‌ నుంచి పిటీషన్‌లు వచ్చే ఆస్కారముంది. ఇప్పటికే 5000 కరోనా కేసులు నమోదు అవుతున్న కేరళ నుంచి మళ్ళీ పిటీషన్లు దాఖలు కావొచ్చు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. వీటన్నింటి దృష్ట్యా… రేపు ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు చాలా కీలకంగా మారనుంది.

Related Articles