కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో లీలలు ఇవి. కరోనా ఎమర్జన్సీ సమయంలో ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్ కొనుగోలు చేశారు. ఇవే కాన్‌సెంట్రేటర్స్‌ను కేరళ ప్రభుత్వం రూ. 32,000ల ధరకు కొంటే, రాజస్థాన్ ప్రభుత్వం రూ. 50,000లకు కొనుగోలు చేసిందని దైనిక్ భాస్కర్ పత్రిక వెల్లడించింది. ఎమర్జన్సీ సమయంలో కొనుగోళ్ళని… పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా.. మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ, అమ్మకాలతో ఏమాత్రం సంబంధం లేని కంపెనీల నుంచి కోవిడ్ వైద్య సామగ్రి కొనుగోలు చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. పైగా మిర్చి, ఉప్పు, ఎల్‌ఈడీ బల్బులు వ్యాపారం చేసే కంపెనీని నుంచి ఈ సామగ్రి కొన్నట్లు దైనిక్ భాస్కర్ వెల్లడించింది. కొన్ని వాటిపై 5 శాతం జీఎస్టీ ఇవ్వాల్సి ఉండగా, 12 శాతం చెల్లించిందని పేర్కొంది. పైగా డెలివరీ కాకముందే జీఎస్టీ చెల్లించడంపై ఆ పత్రిక ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోనీ.. ఇలా కొనుగోలు చేసినవి ఏమైనా పనికి వచ్చాయా అంటే అదీ లేదు. ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్స్ చైనావి. వాటిపై కమాండ్స్ అన్నీ చైనా భాషలో ఉన్నాయి. దీంతో ఆన్, ఆఫ్ చేయాలన్నా రోగులకు తెలియడం లేదు. పైగా ఇవన్నీ నాసిరకమని, కనీసం పది శాతం కూడా సరిగ్గా పనిచేయలేదని డాక్టర్లు అంటున్నారని దైనిక్ భాస్కర్ రాసింది.