వాలంటీర్ల వ్యవస్థపై కోర్టు కీలక వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేకనే వాలంటీర్లను పెట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో తమను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును గతంలో విచారించినపుడు కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవాళ ప్రభుత్వం తరఫున సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ సమయంలో కోర్టు ఆయనకు పలు ప్రశ్నలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని నిలదీసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు వీరిని గుర్తించేవారని… ఇపుడు వాలంటీర్లకు అప్పజెబితే జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాల అమలుకు ఎంచుకున్న ప్రభుత్వం ఎంచుకున్న విధానమే చట్టవిరుద్ధంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. వాలంటీర్ల వ్యవస్థను చట్టబద్ధం చేసి.. వారిని ఉద్యోగులుగా నియమించే అంశాలను పరిశీలించాలని పేర్కొంది. కోర్టు మరిన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ… వీటిపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.

Related Articles