దేశంలోని ఏ ఇతర నగరాలలో లేని విధంగా 2013 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తగ్గలేదు. గతేడాది ద్వితీయార్థంలో నగరంలో ధరలు 5 శాతం మేర పెరిగాయి. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇళ్లకు, ప్రధాన డెవలపర్లయితే నిర్మాణంలో ఉన్న యూనిట్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో 2020 ద్వితీయార్థంలో ఇన్వెంటరీ భారీగా క్షీణించింది.
గతేడాది జూలై– డిసెంబర్‌లో నగరంలో 12,344 గృహాలు విక్రయమయ్యాయి. అంతకుక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 5,260లుగా ఉన్నాయి. ఏడాదిలో 135 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే 2020 ద్వితీయార్థంలో 8,404 యూనిట్లు లాంచింగ్ కాగా.. 2021లో 19,024 గృహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నగరంలో గృహాల ఇన్వెంటరీ 159 శాతం క్షీణించి 18,598లకు చేరాయి. వీటి విక్రయానికి 4.3 త్రైమాసికాల సమయం పడుతుంది. ఇందులో 12,141 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 2,892 యూనిట్లు నార్త్‌లో, 1,643 ఈస్ట్‌లో, 1,230 సౌత్‌లో, 692 యూనిట్లు సెంట్రల్ హైదరాబాద్‌లో ఉన్నాయి. మొదట్నుంచి నగర రియల్టీ మార్కెట్‌కు ఆయువు పట్టు కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలే. ఎప్పటిలాగే గతేడాది లాంచింగ్ అయిన యూనిట్లలో 64 శాతం వెస్ట్ జోన్‌లోనే ఎక్కువగా ప్రారంభమయ్యాయి. కోకాపేట, పీరంచెరు, గోపన్‌పల్లి, నల్లగండ్లలో ఎక్కువగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విక్రయాలలో కూడా పశ్చిమ హెదరాబాద్ జోరు కొనసాగింది.