వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది

యువగళం పాదయాత్రలో వైసీపీ అంతిమ యాత్ర మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయన చేస్తున్న పాదయాత్ర 18వ రోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు ముందు చినరాజకుప్పం విడిది కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన లోకేష్.. రాష్ట్రంలో వైసీపీ పాలనపై మండిపడ్డారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వెయ్యి మంది పోలీసులను మోహరించారని.. జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో తన మైకును తొలగించడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పదో తరగతి తప్పిన జగన్‌కు ఇంత తెలివితేటలుంటే.. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తనకెంత తెలివి ఉండాలన్నారు. లక్ష కోట్ల రూపాయలు దోచేసి జైలుకు వెళ్లిన జగన్ పాదయాత్ర చేస్తే.. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని గుర్తు చేస్తూ.. తాను పాదయాత్ర చేస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. తన పాదయాత్రను అడ్డుకోవడంపై చూపిన శ్రద్ధ.. పోలీసుల సంక్షేమంపై పెట్టాలని హితువు పలికారు. జగన్ పాలనలో కానిస్టేబుల్‌కు రూ.75 వేలు, ఎస్‌ఐకి రూ.90 వేలు, సీఐకి లక్ష రూపాయలు బకాయి పెట్టారని ఆరోపించారు. పోలీసులు, ఉపాధ్యాయ నియామకాలు లేకుండా జగన్ చేశారని ధ్వజమెత్తారు.

Related Articles