కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్పేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. అయ్యప్ప దీక్ష విరమణ అంటే కేరళలోని శబరిమలై అయ్యప్ప ఆలయం ఎలా గుర్తుకు వస్తున్నదో, అంజన్న దీక్ష విరమణ అంటే కొండగట్టు అలా గుర్తుకు వచ్చేలా రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇటీవల రూ.100 కోట్లు కేటాయించామని, ఆలయాన్ని వైభవోపేతంగా నిర్మించేందుకు మరో రూ.1000 కోట్లయినా ఖర్చుచేస్తామని చెప్పారు. పక్కా వాస్తుతో, ఆగమశాస్ర్తాల ప్రకారం ఆలయ పునర్నిర్మాణం మూడేండ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామిని సీఎం బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలోని సమావేశ మందిరంలో కొండగట్టు ఆలయ అభివృద్ధిపై రెండు గంటలకుపైగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణంపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని స్వయంగా వివరించిన సీఎం, పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన భూములు, ఇతర అంశాలపై లొకేషన్ మ్యాపులను సీఎం పరిశీలించారు.