కొండగట్టు ఆలయంలో చోరీ.. దొంగలు ఎవరంటే?

కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బీదర్‌లో దొంగను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు. కొండగట్టు ఆలయంలో శుక్రవారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. తొమ్మిది లక్షల విలువైన మకర తోరణం శఠగోపాలు, వెండి తొడుగు, వెండి వస్తువులు మొత్తం 15 కిలోల వెండి అపహరించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ కోసం దొంగలు.. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఆలయం వెనుక నుంచి గుడిలోకి ప్రవేశించారు. చోరీ అనంతరం వెనుక వైపు నుంచి గుట్ట కిందకు దిగి వెళ్లిపోయినట్లు గుర్తించారు. అనంతరం మెయిన్ రోడ్డుకు వెళ్లి బైకులపై కోరుట్ల, మెట్‌పల్లి మీదుగా కామారెడ్డి, నారాయణ్‌ఖేడ్ నుంచి బీదర్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ దొంగతనానికి ఎనిమిది మంది ఉన్న గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి వారి వద్ద నుంచి 60 శాతం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles