బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీఎం కేసీఆర్‌ను కించపర్చే విధంగా మార్ఫింగ్ చేసిన కార్టూన్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారంటూ అర్వింద్‌పై నమోదైన కేసులో హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. 2021లో డిసెంబరు 31 సందర్భంగా మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 1 గంటల దాకా తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేతిలో మద్యం సీసా ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసిన కార్టూన్‌ను అర్వింద్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలంటూ ఎంపీ అర్వింద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం.. పోలీసులు, ఫిర్యాదు దారులకు నోటీసులు జారీచేసింది. ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా పడింది.