రేపు పండుగ… ఇవాళ నిషేధమా?

ఓ లాయర్‌కు ఠక్కున దీపావళి గుర్తుకు వచ్చింది. కరోనా భయం వెంటాడింది. వెంటనే కోర్టుకు వెళ్ళారు. ఆలస్యం చేయకుండా కోర్టు నిషేధించండి అని ఆదేశించింది. తెల్లవారగానే ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా శబ్ద, వాయు కాలుష్య నివారణకు, కరోనా రోగుల సంరక్షణకు ఇలా చేయడం మంచిదే. కాని రేపు పండుగ అనగా ఇవాళ నిషేధం విధించడమేమిటి? ఎపుడో ఆర్డర్లు ఇచ్చి… అద్దె షాపులు తీసుకుని బాణసంచా దుకాణాలు పెట్టుకున్నవారి సంగతేమిటి? కరోనాతో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్న సమయంలో ఏదో కాస్త పెట్టుబడి పెట్టి దుకాణాలు పెట్టుకున్నవారి కడుపు కొట్టేలా ఈ ఉత్తర్వులు ఏమిటి? లాయర్‌గారికి వెంటనే గుర్తుకు రావొచ్చేమో గాని.. చివరి నిమిషంలో ఇలా నిషేధం విధిస్తే పేద వ్యాపారస్తుల గురించి, వారికి జరిగే నష్టం గురించి న్యాయమూర్తులు కూడా పరిశీలించాలి కదా? కనీసం ప్రభుత్వమైనా కోర్టుకు క్షేత్రస్థాయి పరిస్థితి వివరించాలి కదా? కాలుష్యం కారకం కాని బాణసంచా కాల్చాలని… కరోనా దృష్టిలో పెట్టుకుని ప్రజలు దీపావళి జరుపుకోవాలని ఆదేశిస్తే.. కనీసం దుకాణాల్లో ఇతర సామగ్రినైనా వ్యాపారస్తులు అమ్ముకునేవారు కదా? బాణసంచాలో అన్నీ శబ్ద, వాలుష్యం కల్గించేవి కాదు కదా? ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించి ఎన్నాళ్ళయింది? అప్పటి నుంచి వీరంతా ఏం చేస్తున్నట్లు? చివరి క్షణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటో గమనించారా? ఎందుకంటే ఈసారి అమ్మకాలు ఆగితే మళ్ళీ అమ్మడానికి ఏడాది ఆగాలి?

 

Related Articles