మనీశ్‌ సిసోడియా సీబీఐ కస్టడీకి

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల రిమాండ్‌ విధించింది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకల వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం సిసోడియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన్ను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తు సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోలడం లేదని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మద్యం విధానం కోసం రూపొందించిన ముసాయిదా నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. సిసోడియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో మార్పులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని, సీబీఐ మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెంట పడుతోందని తెలిపారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. నిన్న (ఆదివారం) ఏం జరిగింది? ఆయన్ను ఎందుకు కస్టడీలో ఉంచాల్సి వచ్చింది? రాబోయే రోజుల్లో మళ్లీ విచారణకు ఆయన అందుబాటులో ఉండరా? ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా? ఇది ఓ వ్యక్తిపై దాడి. అలాగే వ్యవస్థపై కూడా. రిమాండ్‌ సరికాదు’ అని సిసోడియా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విచారణ సమర్థంగా జరగాలంటే సిసోడియా కస్టడీ అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. తన ప్రమేయం ఏమీ లేదని సిసోడియా చెబుతున్నారని.. దర్యాప్తులో మాత్రం ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. దాదాపు గంటసేపు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. సాయంత్రం సిసోడియాకు ఐదు రోజుల పాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు.

Related Articles