వివేకాను చంపింది వాళ్లే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి నిందితులు ఎవరో సీబీఐ కనిపెట్టింది. సునీల్‌, ఇతర నిందితులతో కలిసి వివేకాను హత్య చేసినట్లు సీబీఐ తమ నివేదికలో పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌కు బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని.. అందుకే హత్య చేసినట్లు సీబీఐ తేల్చింది. సీబీఐ తేల్చిన ప్రకారం… వివేకాను అవినాశ్‌ రెడ్డి అడ్డు తొలగించుకోవాలనుకోవడానికి కారణం… తన ఎంపీ సీటుకు అడ్డు రావడం! వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి (ఏ5)తో కలిసి అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కుట్రపన్నారు. దానిని దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అమలు చేశారు. దీనికోసం… వివేకాతో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ ఆయనపై కోపం పెంచుకున్న ఎర్ర గంగిరెడ్డి (ఏ1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (ఏ2), డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి (ఏ4 – అప్రూవర్‌), ఉమాశంకర్‌రెడ్డిలను పోగేశారు. ఈ నలుగురే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. గొడ్డలి వేటును గుండెపోటుగా చిత్రీకరించడం, రక్తపు మరకలను తుడిపి వేయించడంలో అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పాత్ర గురించి సీబీఐ ఇదివరకే వెల్లడించింది. కడప లోక్‌సభ టికెట్‌ విషయంలో వివేకాతో విభేదాలున్నాయని కూడా తెలిపింది. ఇప్పుడు మాత్రం ‘అవినాశ్‌ రెడ్డే చంపించారు’ అనేందుకు ప్రాసంగిక సాక్ష్యాలూ ఉన్నాయని చెప్పడం విశేషం. సీబీఐ వెల్లడించిన ప్రకారం… కీలక నిందితుడు సునీల్‌ యాదవ్‌ వివేకా హత్య జరగడానికి ముందురోజు సాయంత్రం అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. ఇతర నిందితులూ/పాత్రధారులూ ఆ రోజు అక్కడ కలుసుకున్నారు. ఇక… వివేకా హత్య జరిగిన రోజు ఉదయం పలువురు నిందితులు అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఇతర నిందితులకు ఇచ్చిన భరోసా మేరకు… వివేకా ఇంటికి వెళ్లి సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు రెడీగా కూర్చున్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణా రెడ్డి నుంచి ఫోన్‌ రాగానే అక్కడికి వెళ్లి… రక్తపు మడుగును శుభ్రం చేయడం, గుండెపోటు కథను ప్రచారం చేయడం, వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజీతో ‘కవర్‌’ చేయడం వంటివన్నీ చేశారని సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇటీవల సీబీఐ అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన కాల్‌డేటా ఆధారంగా కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం! తాజా పిటిషన్‌లో అవినాశ్‌ రెడ్డి ఏ సమయంలో ఎవరెవరికి కాల్‌ చేసి ఎంత సేపు మాట్లాడారో ఫోన్‌ నంబర్లతో సహా వెల్లడించింది. అంతేకాదు… గూగుల్‌ అకౌంట్‌తో అనుసంధానమైన ఫోన్‌ లొకేషన్‌ను పూసగుచ్చినట్లు వెల్లడించే ‘గూగుల్‌ టేకౌట్‌’ ఆధారంగా కీలకమైన వివరాలు రాబట్టింది. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సునీల్‌ యాదవ్‌… అంతకుముందు రోజు సాయంత్రం అవినాశ్‌ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని ‘గూగుల్‌ టేకౌట్‌’ నిర్ధారించింది. సునీల్‌ అక్కడి నుంచే షేక్‌ దస్తగిరికి (గొడ్డలి తెచ్చేందుకు కదిరికి వెళ్లాడు) రెండుసార్లు కాల్‌ చేశాడు. ఆ తర్వాత… వివేకా ఇంటి సమీపంలోనే రాత్రి 1.30 గంటల వరకూ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ మద్యం తాగుతూ ‘తగిన సమయం కోసం వేచి చూస్తున్నారని’ ఫోన్‌ లొకేషన్‌ ద్వారానే తేల్చారు. ఇక… వివేకాది సహజమరణంగా చిత్రీకరించేందుకు అవినాశ్‌ రెడ్డి, ఇతర నిందితులు చేసిన ప్రయత్నాలన్నీ సీబీఐ వివరించింది. 68 పేజీలున్న పిటిషన్‌లో అనేక కీలక వివరాలు వెల్లడించింది.

Related Articles