మీరు పరస్పరం పరిష్కరించుకోండి

అంతర్‌ రాష్ట్ర ఒప్పందాలను ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్రం జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందంటూ ఏపీ వేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలు పరస్పరం కూర్చొన్ని చర్చించుకోవాలని సూచించారు. ఒక రాష్ట్రం తరఫున తాను ఇదివరకే వాదించి ఉన్నందున ఈ కేసును మరో బెంచ్‌కు లిస్ట్‌ చేస్తానని ఆయన అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నిబంధలను ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో ఆరోపించింది. ఏపీ తరఫున సీనియర్‌ లాయర్ దుష్యంత్‌ దవే వాదించారు. జస్టిస్‌ ఎన్‌వి రమణ సలహా విన్న తరవాత… ఇది రాజకీయ అంశమని, రాష్ట్ర ప్రభుత్వం అడిగి చెబుతానని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో జరిగినది చూసిన తరవాత.. అలాంటిది ఇక్కడ జరగకూడదని భావిస్తున్నానని దవే అన్నారు. దీనికి జస్టిస్‌ ఎన్‌వి రమణ స్పందిస్తూ.. అలాంటివి మీరు కలలో కూడా ఊహించొద్దని అన్నారు. ఎల్లుండి ఈ కేసును లిస్ట్‌ చేస్తున్నానని అన్నారు. ఈ కేసును తాను విచారించడం లేదని ఆయన పునరుద్ఘాటించారు.

Related Articles