ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్‌ నిమ్స్‌లో ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్‌ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. నిమ్స్‌లో డాక్టర్‌ ప్రీతిని గవర్నర్‌ తమిళిసై గురువారం పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్‌గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను’ అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని.. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్‌ వద్ద.. ప్రీతి తల్లిదండ్రులు భోరున విలపించారు.

Related Articles