పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి.. ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ఆమె భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ పోలీస్ కాన్వాయ్‌తో ప్రీతి డెడ్‌బాడీని జనగామ జిల్లా మొండ్రాయిలోని గిర్ని తండాకు తరలించారు. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని మనస్థాపంతో పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఈ నెల 22న వరంగల్‌లోని ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించింది.