సుప్రీంకోర్టులో అసదుద్దీన్‌ పిటిషన్‌

పౌరసత్వ సవరణ చట్టంపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటీషన్‌ వేసిన విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్‌ చేశారు. భిన్నత్వ, సెక్యూలరిస్ట్‌, రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామ్య భారత్‌ కోసం తాను పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగపరంగా తమకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు.
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లు ప్రతులను చింపేశారు. ‘‘దక్షిణాఫ్రికాలో ఇలాంటి వివక్షాపూరిత బిల్లునే నాడు బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చింది. ఇది ప్రజలను విడదీస్తుందని అంటూ గాంధీజీ ఆనాడు దానిని నిలువునా చింపి పారేశారు. ఆ తరువాతే ఆయనను మహాత్ముడని కీర్తించడం మొదలెట్టారు. ఈ బిల్లు దేశంలోని ముస్లింలకు నిలువనీడ లేకుండా చేస్తుంది. ఇందుకు నిరసనగా నేను కూడా ఈ బిల్లును చింపిపారేస్తున్నా’’ అని ఆ బిల్లు ప్రతిని చించేశారు.

Related Articles