సోమవారం దాకా ఏ దర్యాప్తూ వొద్దు

ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటనకు సంబంధించిన భద్రతా లోపాలపై  అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తోంది. ఇవాళ ప్రధాని భద్రతపై దాఖలపై పిటీషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వచ్చే సోమవారం వరకు ఎలాంటి దర్యాప్తు చేయొద్దని రెండు కమిటీలకు ఆదేశించింది. ఈలోగా ప్రధాని పర్యటనకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రికార్డులను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టుకు చెందిన రిజిస్ట్రార్‌ జనరల్‌కు అప్పజెప్పాలని ఆదేశించింది. కోర్టు ఆ రికార్డులను భద్రంగా ఉంచాలని పేర్కొంది. చండీఘడ్‌కు చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఎన్‌ఐఏ నుంచి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఈ రికార్డులు అప్పగించే పనిలో సహకరించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జనవరి 10న అంటే వచ్చే సోమవారం చేపడుతామని.. అప్పటి వరకు రెండు కమిటీలూ ఎలాంటి దర్యాప్తు చేయొద్దని ఆదేశించింది. అంతకుముందు పిటీషనర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ మణిందర్‌ సింగ్‌ వాదించారు. ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ సూర్య కాంత్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన బెంచ్‌ ఈ పిటీషన్‌ను విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పంజాబ్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ డీఎస్‌ పాట్వాలియా వాదించారు. ఈనెల 5న పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకోవడం వెనుక కొన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థల హస్తం ఉందని తుషార్‌ మెహతా ఆరోపించారు. పంజాబ్‌ వేసిన కమిటీ ఛైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయని పిటీషనర్‌ తరఫు లాయర్‌ వాదించారు.దీనికి పంజాబ్‌ అడ్వొకేట్‌ జనరల్ మాట్లాడుతూ తాము వివాదాల్లోకి వెళ్ళదల్చుకోలేదని… ప్రధాని భద్రత తమకు అత్యంత ప్రధాన విషయమని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. తాము నిస్పక్షపాత దర్యాప్తు కోరుతున్నామని అన్నారు. కేంద్రం తన కమిటీలో ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ను నియమించిందని.. అయితే ప్రధాని భద్రతను చూసే బాధ్యత కూడా అతనిదేనన్న విషయాన్ని గుర్తు చేశారు. బాధ్యత వహించాల్సిన వ్యక్తి కమిటీలో ఎలా ఉంటారని పంజాబ్‌ అడ్వొకేట్‌ జనరల్ అన్నారు. దీంతో రెండు కమిటీలూ సోమవారం వరకు ఎలాంటి దర్యప్తు చేయొద్దని ఇది మౌఖిక ఉత్తర్వులని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు.

 

Related Articles