ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పరిశీలిస్తాం…కాని

ముగ్గురు విద్యార్థి ఉద్యమకారులకు బెయిల్‌ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము పరిశీలిస్తామని సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులకు హామి ఇచ్చింది. ఉద్యమకారులు మాత్రం బెయిలుపై ఉంటారని స్పష్టం చేసింది. నటాషా, దేవాంగన, ఆపిఫ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిలు ఇవ్వడంతో, వారు నిన్న రాత్రి తిహార్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. వీరికి బెయిలు ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసులు ఇవాళ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. జస్టిస్‌ హేమంత్ గుప్తా, జస్టిస్‌ వి సుబ్రమణియంలతో కూడిన బెంచ్‌ ఈ అప్పీల్‌ను విచారించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశంలోని అనేక కేసులపై ప్రభావం పడుతుందని పోలీసులు వాదించారు. యూఏపీఏ చట్టం కింద అనేక మందిని అరెస్ట్‌ చేశారని.. వారందరూ ఈ తీర్పు ఆధారంగా బెయిలు కోరుతారని పేరొన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫున అటార్నీ జర్నల్‌ తుషార్‌ మెహతా వాదించారు. హైకోర్టు ముగ్గురికి బెయిల్‌ ఇస్తూ ఒక మినీ విచారణలాంటిది జరిపారని, దాదాపుగా వారిని ఈ కేసు నుంచి విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారని తుషార్‌ మెహతా వాదించారు. ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించారని.. వీరిలో పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. 700 మంది గాయపడిన అంశాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అల్లర్లకు పాల్పడిన వారు యూఏపీఏ చట్టం కిందకు రారనే అర్థంలో హైకోర్టు పేర్కొందన్నారు. బెయిల్ విచారణ కూడా తమకు ఆశ్చర్యం కల్గించిందని సుప్రీం కోర్టు బెంచ్‌ పేర్కొంది… ఈ ఆదేశం ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంటుందన్న వాదనతో ఏకీభవించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తామని చెబుతూ… వారికి ఇచ్చిన బెయిల్‌ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. ఉద్యమకారుల తరఫున సీనియర్ అడ్వొకేట్‌ కపిల్ సిబల్ వాదించారు.

Related Articles