హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌

హైదరాబాద్ వాసులకు మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ డివిజన్‌ పరిధిలో నిర్మించిన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ కాసేపట్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. ‘హ్యాపీ న్యూ ఇయర్ హైదరాబాద్. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్ టీమ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కొత్త సంవత్సరం రోజున మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. 6లైన్లతో 3.71 కిలోమీటర్ల షేక్‌పేట్ ఫ్లైఓవర్ భాగ్యనగరవాసులకు అందుబాటులోకి రానుంది. చాలా సంతోషంగా ఉంది. రూ.333 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో టోలీచౌకీ, రాయదుర్గం మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన మూడున్నరేళ్లుగా కొనసాగిన ఈ ఫ్లైఓవర్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. కులీకుతుబ్‌షాహి టూంబ్స్‌, ఫిలింనగర్‌, ఓయూకాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్ల మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. గెలాక్సీ థియేటర్‌ నుంచి మల్కం చెరువు వరకు 2.71 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మించారు. 24 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లతో వాహనాల రాకపోకలకు సిద్ధం చేశారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఎక్కడా సిగ్నల్స్‌ లేకుండా గమ్యస్థానాలకు చేరేలా ఈ ఫ్లైఓవర్‌ ఎంతో ఉపయోగపడనుంది.

Related Articles