వైఎస్ వివేకా హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వివేక మృతిపై సీబీఐకి సహకరించడం లేదని, తెలుగుదేశంకు.. గూగుల్ టెక్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక.. జగన్ హస్తం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కరప్ట్ చేసి.. అవినీతి పరిపాలన చేస్తున్నప్పుడు సీఎం జగన్‌కు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలో ఐపీసీ అమలు కావడంలేదని, జేపీసీ (జగన్ పీనల్ కోడ్) అమలవుతోందన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ పోయి జగన్ పీనల్ కోడ్ వచ్చిందన్నారు. పోలీసులు కూడా జేపీసీనే ఫాలో అవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేయడానికి అవకాశం లేదా..? అని యనమల ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో..అందరి హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలను ప్రశ్నిస్తోందని, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యడానికేనని, ప్రతిపక్షాలను అణిచివేయడానికి కాదని అన్నారు.