నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్ధి నవీన్‌ హత్య కేసులో సోమవారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుడికి సహకరించిన స్నేహితుడు హస్సేన్‌, ప్రియురాలు కట్ట నిహారికారెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు. గత నెల 17న తన స్నేహితుడైన నేనావత్‌ నవీన్‌ నాయక్‌ను మోటర్‌ సైకిల్‌పై నల్గొండలో విడిచి పెడుతానని తీసుకెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన హరిహరకృష్ణ అతడిని పెద్ద కత్తితో తల, గుండె, మర్మాంగం వేరు చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం హరి హరకృష్ణ తుర్కయంజాల్‌, జేఎన్‌యూఆర్‌ఆర్‌ఎం, బ్లాక్‌ నెం.6/4లో నివాసముండే తన స్నేహితుడైన ప్రబలిటి హస్సేన్‌ ఇంటికి వెళ్లి నవీన్‌నాయక్‌ను హత్య చేసిన విషయాన్ని తెలిపి సహాయం చేయాలని కోరాడు. హత్య చేసిన రోజు రాత్రి హరిహరకృష్ణ, హస్సేన్‌ ఇద్దరు కలిసి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి నవీన్‌నాయక్‌ శరీర భాగాలను తీసుకుని మన్నెగూడ ప్రాంతంలో వేశారు. ఆ రోజు హస్సేన్‌ ఇంట్లోనే హరిహరకృష్ణ తలదాచుకున్నాడు. రాత్రి వాట్సాప్‌ చాటింగ్‌లో తన ప్రియురాలు నిహారికకు ఈ వివరాలు చెప్పి, మరుసటి రోజు 18వ తేదీన హస్తినాపురం, క్రిస్టియన్‌కాలనీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. హత్య చేసిన విషయాన్ని పూర్తిగా వివరించి, ఆమె వద్ద ఖర్చుల కోసం రూ.1500 తీసుకున్నాడు. 24వ తేదీన హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోవాలనుకున్నాడు. పోలీసులకు లొంగిపోక ముందు హస్తినాపురంలోని నిహారిక ఇంటికి వెళ్లి కలుసుకున్నాడు. అక్కడే స్నానం చేసి, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఆమె సెల్‌ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ చాటింగ్‌, నవీన్‌ మృతదేహానికి సంబంధించిన ఫొటోలను, కాల్‌ డాటాను డిలీట్‌ చేశాడు. అనంతరం వెళ్లి పోలీసులకు లొంగిపోవడంతో నిందితుడిని 25వ తేదీన అరెస్ట్‌ చేశారు.

Related Articles