దద్ధరిల్లిన ధర్నా చౌక్‌

కేంద్రప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, దీన్ని పార్లమెంటు ఆమోదించడం దేశచరిత్రలో దౌర్భాగ్యకరమని ముస్లిమ్ సంఘాలు ఆరోపించాయి. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం తీవ్ర విషాదకరమని, దేశ సమగ్రతకు, సమైక్యతకు ఈ బిల్లు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని ముస్లిం సంఘాల నేతలు విమర్శించారు. చట్టంలోని పలు అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ధర్నా చౌక్ లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, ముస్లిమ్ సంస్థల ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చారు.

జమాఅతె ఇస్లామీహింద్ రాష్ట్ర అధ్యక్షుడు హామిద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునేదాకా పోరాటం సాగిస్తామన్నారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు హామిద్ ముహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉందన్నారు. ఈ బిల్లు మతపరంగా వివక్ష చూపేలా ఉందని, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆంటోనీ రాజ్ అభిప్రాయపడ్డారు. పూలే అంబేద్కర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ మలిక్ మాట్లాడుతూ ఈ బిల్లు మతంపై ఆధారపడిన ఈ బిల్లు సుప్రీంకోర్టులో నిలబడదన్నారు. ఎన్‌ఆర్‌సీలో హిందువులు తమ పౌరసత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదని, అయితే ముస్లిం మాత్రం పౌరసత్వం నిరూపించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇది మత వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని ప్రముఖ సామాజిక కార్యకర్త ఇక్బాల్ అహ్మద్ ఇంజనీర్ అన్నారు. ఈ చట్టం పట్ల నిరసనగా తాను ఎన్‌ఆర్‌సీలో అవసరమైన పత్రాలు చూపించేది లేదని మరో ముస్లిమ్ సంఘ నాయకుడు నశీరుద్దీన్ అన్నారు. ఈ బిల్లు హిట్లర్ చట్టాల కన్నా దారుణమైందని బిల్లు కాపీలని ధర్నా కార్యక్రమంలో చించివేయాలని పిలుపు ఇచ్చారు. ఈ బిల్లును లోక్ సభలో ఆమోదించిన రోజు ఆధునిక భారత చరిత్రలో చీకటి దినమని పి.ఓ.డబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య వర్ణించారు. ఈ బిల్లును ఆమె అమానుషమైన ప్రక్రియగా పేర్కొన్నారు. పౌరసత్వ బిల్లుకు, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ప్రజలు సహాయనిరాకరణ చేయాలని ఎస్ఐఓ కార్యదర్శి ఫైజ్ పిలుపునిచ్చారు. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుని ఓట్లు పొందిన అనేక పార్టీలు ఈ బిల్లుకు మద్దతిచ్చి తమ నిజరూపాన్ని ప్రజలకు చూపించాయని ఆయన అన్నారు.

వహదతె ఇస్లామీ అధ్యక్షులు మౌలానా నశీరుద్దీన్, అవామీ మజ్లిసె అమల్ అధ్యక్షులు ముజాహిద్ హాష్మి, మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యదర్శి సలీమ్ హిందీ, ఎస్ఐఓ అధ్యక్షులు తల్హా ఫయాజుద్దీన్, జమాఅతె ఇస్లామీహింద్ మహిళా విభాగం నాయకురాలు ఖాలిదా పర్వీన్ తదితరులు మాట్లాడారు.

Related Articles