ఎంపీ అసదుద్దీన్‌ వియ్యంకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలు, భూవివాదాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్‌ మజర్‌ అలీఖాన్‌ సోమవారం రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న మజర్‌ అలీఖాన్‌ నగరంలోని ప్రముఖ అర్థోపెడిక్‌ వైద్యుల్లో ఒకరు. దారుస్సలాంలోని ఒవైసీ హాస్పిటల్‌లో 25 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు డాక్టర్‌ అబిద్‌ అలీఖాన్‌కు రెండేండ్ల క్రితం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కుమార్తె యాస్మిన్‌తో వివాహం జరిగింది. కొంతకాలంగా మజర్‌ అలీఖాన్‌కు అయన భార్య ఆఫియారషీద్‌ అలీఖాన్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం దాటినా మజర్‌ అలీఖాన్‌ హాస్పిటల్‌కు రాకపోవడంతో కొడుకు డాక్టర్‌ అబిద్‌ అలీఖాన్‌ ఇంటికి ఫోన్‌ చేశాడు. ఎంతకీ తండ్రి ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో డ్రైవర్‌ తాజుద్దీన్‌ను అప్రమత్తం చేశాడు. అతడు వెళ్లి కిటికీలోంచి చూడగా మజర్‌ అలీఖాన్‌ రక్తపు మడుగులో కనిపించారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అలీఖాన్‌ మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

Related Articles