ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టం… లులు గ్రూప్‌

(అమరావతి నుంచి కె స్రవంతి చంద్ర)

వైజాగ్‌లో తాము నిర్మించ తలపెట్టిన కన్వెన్షన్‌ సెంటర్‌కు కేటాయించిన భూములను జగన్‌ ప్రభుత్వం రద్దు చేయడంపై గల్ఫ్‌కు చెందిన లులు గ్రూప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో తమ గ్రూప్‌ పెట్టుబడులు పెట్టదని స్పష్టం చేసింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కేరళలో మాత్రం తమ పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. చంద్రబాబు హయంలో వైజాగ్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు లులు గ్రూప్‌కు 13.83 ఎకరాలను కేటాయించారు. అత్యంత పారదర్శక పద్ధతిలో తమకు భూముల కేటాయింపు జరిగిందని, ఇక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించేందుకు డిజైనింగ్‌తో పాటు ఇతర ప్రాథమిక పనులకు కాంట్రాక్టులు ఇచ్చామని, భారీ మొత్తం ఖర్చు పెట్టిన నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం భూ కేటాయింపు రద్దు చేయడంపై లులు గ్రూప్‌ విస్మయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని, అయితే ఇక నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టమని స్పష్టం చేసింది. గల్ఫ్‌ కేంద్రంగా ఉన్న లులు గ్రూప్‌ వైజాగ్‌ ప్రాజెక్టుపై రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, షాపింగ్‌ మాల్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో వైజాగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని తాము భావించామని లులు గ్రూప్‌ డైరెక్టర్‌ (ఇండియా) అనంత రామ్‌ అన్నారు. లులు గ్రూప్‌ను కేరళకు చెందిన ఎం.ఎ. అసిఫ్‌ అలీ స్థాపించారు. ఈ గ్రూప్‌లో ఏకంగా 57,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టాల్సిందిగా కోరేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హెలికాప్టర్‌ కేరళకు వెళ్ళి యూసుఫ్‌ అలీతో చర్చలు జరిపారు.

 

Related Articles