అమ్మ ఒడికి నిధుల్లేవ్‌…. మళ్ళించండ్రా…

గత ఏడాది జులై 12వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ అన్నమాటలు ఇవి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న అమ్మ ఒడికి సంబంధించి ప్రారంభ పలుకులు అవి. ఈ సందర్భంగా ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ పేరు ఎందుకు పెట్టారో సభకు మంత్రి వివరించారు.
‘పథకాలకు పేరు పెట్టాలని అనుకున్నప్పుడు.. గౌరవ ముఖ్యమంత్రి గారిని తాము ప్రాధేయపడితే తప్ప తన పేరు పెట్టడానికి ఆయన అంగీకరించలేదని, ఎన్నిసార్లు అడిగినా ఆ పథకానికి తన పేరు వొద్దని చెప్పారని… దేశంలోని మొట్టమొదటిసారిగా పిల్లలను చదివిస్తున్న తల్లికి ప్రోత్సాహకం ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రిది కాబట్టి… ఈ పథకానికి ఆయన పేరు పెట్టామ’ని అన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన 42 రోజులకు మంత్రి అన్నమాటలు ఇవి. బహుశా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఈ ప్రకటన చేశారని అనుకున్నారు జనం. బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.6,455 కోట్లు కేటాయించారు.
మొత్తం విద్యాశాఖకు 2019-20 బడ్జెట్‌లో రూ. 32,618 కోట్లు మంత్రి బుగ్గన కేటాయించినట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 34.87 శాతం అధికమని, మొత్తం బడ్జెట్‌లో 14.31 శాతమని ఆయ అన్నారు. స్కూల్‌ ఎడ్యకేషన్‌ పద్దులకే రూ. 27,029 కోట్లు కేటాయించగా, అందులో రూ.6,455.80 కోట్లు జగనన్న అమ్మ ఒడికి కేటాయించారు.

నిధులు ఏవీ?
ప్రకటించినట్లుగానే జనవరిలో అమ్మ ఒడి ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం తడబడుతూనే ఉంది. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 6,455 కోట్ల కేటాయించడానికి నిధుల్లేని పరిస్థితి. దీంతో కొత్త ఐడియాను అమలు చేశారు. అదేమిటంటే వివిధ కులాలు, మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ‘అదనంగా’ నిధులను కేటాయించి… అవే నిధులను అమ్మ ఒడికి తరలించారు. అంటే అమ్మ ఒడి కోసం పెట్టిన వ్యయం… బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి కేటాయించిన మొత్తంగా కూడా చూపుతున్నారా అన్న అనుమానం కల్గుతోంది. సో…. బడ్జెట్‌లో పేర్కొన్నట్లు సాధారణ విద్య శాఖకు ప్రత్యేకంగా అమ్మ ఒడి బడ్జెట్‌ లేదన్నమాట. సంక్షేమ శాఖ నిధులనే విద్యా శాఖలోని అమ్మ ఒడి పద్దుకు తరలించారు. దీనికిగాను ఇవాళ ప్రత్యేకంగా అయిదు జీవోలను ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది. ఈ అయిదు జీవోల ద్వారా దాదాపు రూ. 6100 కోట్లను ‘అదనంగా’ వివిధ సంక్షేమ కార్పొరేషన్ల నుంచి అమ్మ ఒడి పథకానికి తరలించారు. సింహ భాగం బీసీల సంక్షేమానికి సంబంధించినవి. ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వలను సడలిస్తూ… ఈ ఆర్థిక సంవత్సరంలో ఎపుడైనా ఈ నిధులకు ఆమోదం పొందేలా జీఓలు జారీ చేశారు.
వివిధ కార్పొరేషన్లు.. వాటి నుంచి అమ్మ ఒడికి బదిలీ అయిన నిధుల వివరాలు ఇవి…

  1. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ. 145 కోట్లు కేటాయింపు… (ఏ పథకం కింద కేటాయింపులు చేశారో పేర్కొనలేదు)
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ (9,679 మంది క్రిస్టియన్‌ లబ్దిదారులకు చెల్లిస్తారు)
  2. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ. 428.24 కోట్లు కేటాయింపు (కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం కింద)
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ (2,85,495 మంది ముస్లిం లబ్దిదారులకు చెల్లిస్తారు)
  3. ఏపీ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ. 1,271 కోట్లు కేటాయింపు (మార్జినల్‌ సబ్సిడీ పథకం కింద)
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ
    (ఎంత మంది లబ్దిదారులో పేర్కొనలేదు)
  4. ఏపీ బీసీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ. 3,432 కోట్లు కేటాయింపు (ఆర్థిక సాయం కింద)
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ (3,80,168 ఈ బీసీలు, 19,07,836 బీసీ లబ్దిదారులకు చెల్లిస్తారు)
  5. ఏపీ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు రూ.395 కోట్లు కేటాయింపు (ఏ పథకం కిందనో పేర్కొనలేదు)
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ (అబ్దిదారుల సంఖ్య పేర్కొనలేదు)
  6. ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు రూ. 568 కోట్లు కేటాయింపు (ఆర్థిక సాయం కింద )
    మొత్తం నిధులు అమ్మ ఒడికి బదిలీ (3,79,033 కాపు లబ్దిదారులకు చెల్లింపు)

నిధులెక్కడ?
ఈ నిధులన్నీ కార్పొరేషన్లకు ‘అదనంగా’ ఇస్తున్నామనిజీఓలో పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు ఉంటే నేరుగా విద్యా శాఖకే కేటాయించవచ్చు కదా? కార్పొరేషన్లకు ఇవ్వాల్సిన నిధులనే ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మరి ఈ ‘అదనం’ అనే మాటెందుకు? ఆర్థికంగా పూర్తిగా చతికిల పడిన ప్రభుత్వానికి అమ్మ ఒడి కోసం ఇతర పథకాల్లో కోత వేయక తప్పేలా లేదు.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా

 

 

 

 

 

బీసీ కార్పొరేషన్‌ నుంచి మళ్ళింపు ఇలా

Related Articles