ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన విశ్లేషణను గమనిస్తే… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు సునాయసమని ఇట్టే అర్థమైపోతోంది. మజస్లిస్ ఎటూ ఉంది కాబట్టి… ఇపుడు జరిగే ఎన్నికల్లో కేవలం 38 డివిజన్లు గెలిస్తే చాలు … మేయర్ పదవి టీఆర్‌ఎస్‌కు దక్కినట్లే. దీనిక ప్రధాన కారణం… ఎక్స్ అఫీషియో ఓట్లే. టీఆర్‌ఎస్ ఖాతాలోని 35 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఆప్షన్‌తో మరో 3 ఓట్లు అదనంగా వచ్చి చేరుతాయి. దీంతో 38 ఎక్స్‌అఫిషియో ఓట్లు టీఆర్‌ఎస్ చేతిల ఉన్నాయి. అంటే దీంతో 38 డివిజన్లు గెలిస్తే.. మేయర్ పదవి టీఆర్‌ఎస్‌కు దక్కినట్లేనని ఆంధ్రజ్యోతి విశ్లేషించింది.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం 102. ఈసారి కూడా 100కు పైగా డివిజన్లలో గెలుస్తామని ఆ పార్టీ అంటోంది. ఆ స్థాయిలో సీట్లు గెలవకపోయినా… మేయర్ పదవి ఖాయంగా టీఆర్‌ఎస్ ఖాతాలో పడేలా వ్యూహం రచించారు గులాబీ నేత. అనూహ్యంగా చాలా ముందుగా ఎన్నికలు ప్రకటించి విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చారు. ఇపుడు ఎంత గట్టి పోటీ ఇచ్చినా… మేయర్ పీఠం దక్కడం విపక్షాలకు కష్టం. ఇపుడు టీఆర్‌ఎస్ ఇదే స్లోగన్‌తో ఎన్నికలకు పోతోంది. ఎటూ మేయర్ పదవి తమదే కాబట్టి… మీ డివిజన్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తే… అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేసే అవకాశముంది. ఈసారి ఇదే స్లోగన్ కీలకమైతే కేటీఆర్ అన్నట్లు వంద డివిజన్లు టీఆర్‌ఎస్ ఖాతాలో పడటం పెద్ద కష్టం కాదు.
ఎంఐఎంతో కలిస్తే…
జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్ పదవికి మేజిక్ ఫిగర్ 76 సీట్లు. అయితే మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎ్‌సకు 38 ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 38 మంది కార్పొరేటర్లు గెలిస్తే మేజిక్ ఫిగర్ 76కు చేరుకుంటుంది. అంటే టీఆర్‌ఎస్ నుంచి కేవలం 38 మంది కార్పొరేటర్లు గెలిచినా మేయర్ పదవి దక్కుతుంది. అన్నీ సర్దుకుని ఎంఐఎం కూడా కలిసి వస్తే… గెలుపు నల్లేరుపై నడకే కానుంది. ఎంఐఎంకు జీహెచ్‌ఎంసీలో 10 ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయి. వీరు కూడా మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తే.. ఎక్స్‌అఫిషియో ఓట్ల సంఖ్య 48కు చేరుతుంది. అంటే టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కలిసి 28 డివిజన్లలో గెలిచినా మేయర్ పీఠం ఆ కూటమికి దక్కుతుంది. టీఆర్‌ఎస్‌కు 102, ఎంఐఎం చేతిలో 44 డివిజన్లు ఉన్నాయి. సో ఎంఐఎంతో సంబంధం లేకుండా టీఆర్‌ఎస్ సొంతంగా మేయర్ పదవి దక్కించుకోవాలంటే… 38 డివిజన్లు… రెండు కలిసి పోటీ చేస్తే 28 డివిజన్లు గెలిచినా… మేయర్ పదవి వీరి చేతిలోనే ఉంటుంది.