రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
రెడీగా ఉన్నాయి…
రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తెచ్చారు. దీంతో వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
57 వైద్య పరీక్షలు
ఈ డయాగ్నోసిస్ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సిఎం తెలిపారు.