రేవంత్‌ రాజకీయ ప్రస్థానం

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్లుండి అంటే ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అంచలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి జీవితంలో తెలుగు దేశం పార్టీ కీలక భూమిక పోషించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుంచి అంతర్గతంగా, ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి… చెరగని ఆత్మ విశ్వాసం, పట్టుదలతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. తొమ్మిది నెలల క్రితం కూడా తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉండేది. అంది వచ్చిన ప్రతి అంశాన్ని అంది పుచ్చుకోవడం, హైకమాండ్‌ నుంచి అందిన సహకారంతో ఈ ఎన్నికల్లో రేవంత్‌ కీలక పాత్ర పోషించారు. సీనియర్లతో పాటు చాలా మంది కీలక నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితంగ ఆకాగా… పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి… పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. అందరినీ కలుపుకుంటూ పోయారు. గెలుపే ఏకైక అర్హతగా అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీకి కలిసి వచ్చింది. ఎల్లుండి సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేసిన రేవంత్‌ తొలుత ప్రింటింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ వ్యాపారంలో కొనసాగారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉన్నా… ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే సరికి…స్వతంత్రంగా ఉన్నారు. 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తొలి ఎన్నికలోనే గెలుపు సాధించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. 2008లో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆయన రాజకీయ జీవితం కీలక మలుపు. ఆ పార్టీలో ఆయన ప్రస్థానం మున్ముందు రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది. మంచి వక్తగా, విషయం ఏదైనా అనర్గళంగా తన వాదనను వినిపించే నైపుణ్యం అక్కడే సాధించారు. అనేక అంశాలపై పట్టు సాధించారు. ముఖ్యంగా పొలిటికల్‌ ఫైనాన్షియల్‌ అంశాలపై కూడా మంచి పట్టు సాధించడంతో… జగన్మోహన్‌ రెడ్డిపై దాడి చేయడంలో ముందుండేవారు. ఇక ఎన్నికల విషయానికొస్తే 2009లో కొడంగల్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరవాత తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే జీవితంలో తొలి ఓటమిని ఎదురు చూశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ వెంటనే వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఢిల్లీలో ఉంటూ హైకమాండ్‌కు మరింత చేరువయ్యారు. తరచూ పార్లమెంటులో కీలక అంశాలపై మాట్లాడుతూ జాతీయ నేతల దృష్టిని ఆకర్షించారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌ సొంత పార్టీలోనే ముఖ్యంగా సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పీసీసీ పదవిని కొనుక్కొన్నారని కొందరు, టీడీపీ అధినేత చంద్రాబు లాబీయింగ్‌తో ఆయనకు పీసీసీ పదవి వచ్చిందని మరికొందరు విమర్శించారు. అయితే ప్రతి రోజూ ఏదో విధంగా జనం మధ్య ఉంటూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో సక్సెస్‌ అయ్యారు. భారాస నేతలు కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసే దమ్మున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పరోక్షంగా కేసీఆర్‌ వ్యతిరేకులను ఆకర్షించగలిగారు. సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చారు. యువతలో ముఖ్యంగా నిరుద్యోగ యువతలో జోష్‌ తెచ్చారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. హైకమాండ్‌తో పాటు స్థానిక, పొరుగు రాష్ట్రాల నేతల సాయంతో ప్రచారాన్ని పీక్‌కు తీసుకెళ్ళారు. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలతో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్ళారు. కాంగ్రెస్‌లో జనాకర్షక నేతగా నిలిచారు. మరోమాట లేకుండా హైకమాండ్‌ రేవంత్‌ను సీఎంగా ప్రకటించింది.

Related Articles