రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ మరోసారి భేటీ అయింది. రానున్న 2022 – 23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా…ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000 రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5000 మూడవ సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది. ఆయిల్ పామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.