రేపటి నుంచి ప్రజాదర్బార్‌..

ఎన్నికల ప్రచారం సమయంలో అన్న మాటలను నిలబెట్టుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత ఆయన తొలిసారి ఎల్బీ స్టేడియంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యమని,. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని రేవంత్‌ అన్నారు. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతామని ఆయన హామీ ఇస్తూ… శుక్రవారం అంటే రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అన్నారు. పదేళ్లుగా కష్టపడిన తమ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని అన్నారు. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని సభా ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి హామి ఇచ్చారు. తొలి ప్రసంగాన్ని ఆయన క్లుప్తంగా ముగించడం విశేషం.

Related Articles