సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించనుంది.ఈ కేసుల్లో ఏడు రోజుల్లో పోలీస్ దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో కోర్టులో వాదనలు పూర్తి చేసి… 21 రోజుల్లో తీర్పు వెల్లడించాలని కేబినెట్ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 3 వారాలకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టానికి ‘ఏపీ దిశ’ చట్టంగా పిలవాలని నిర్ణయించారు. అలాగే ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యాచార కేసులకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్ దాడులు, అత్యాచారం కేసులు తేవాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
Related Articles
TS: నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ
- March 9, 2023
ఊహించని షాకిచ్చిన చిరు ఉద్యోగులు..
- January 9, 2022
ఫిట్మెంట్ 23.29 శాతం
- January 7, 2022