ఎల్లుండి కేబినెట్‌ సమావేశం

లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం
ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చర్చ
థర్డ్‌వేవ్‌కు సన్నద్ధతపై కసరత్తు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎల్లుండి జరగనుంది. జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనుంది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందనే అంశాలపై కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. అలాగే ఇపుడు రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌పై కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.
రాష్ట్రంలో వైద్యం,కరోనా స్థితిగతులు ., ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు., లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.., అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరుపుతారు. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో., థర్డ్ వేవ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది.

Related Articles