వైసీపీ.. రాష్ట్రానికి పట్టిన శని..

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రా ష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేసేశాడని విరుచుకుపడ్డా రు. కాకినాడలో రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జగ్గంపేటలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జె.తిమ్మాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి పెద్దాపురం వరకు భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత సామర్లకోట వరకు రోడ్‌ షో చేపట్టారు. ఆయా సందర్భాల్లో సీఎం జగన్‌ తీరు పై చంద్రబాబు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పేదలు, ధనికులకు మధ్య పోరాటమని జగన్‌ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడని.. వాస్తవానికి దేశంలో ఆయనంత సంపన్నుడైన ముఖ్యమంత్రే లేరని చెప్పారు. ‘రూ.373 కోట్ల ఆస్తులున్నట్లు 2019 ఎన్నికల అఫిడవిట్‌లో చూపించాడు. పాత అఫిడవిట్‌ ప్రకారమే అంత ధనికుడైన జగన్‌.. ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతూ నాటకాలాడుతున్నాడు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాడు. రాబోయే ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వడానికి ఇప్పటి నుంచే డబ్బులు స్టాకు పెట్టాడు. అలాంటి వ్యక్తి పేదల గురించి మాట్లాడడమా? బాబాయిని చంపించి నాపై నెట్టేశాడు. రక్తం రుచి మరిగిన రాక్షసుడు. జనం నెత్తిన 48 రకాల పన్నులు మోపిన ఘరానా దొంగ. ఇంతచేసి ఇప్పుడు ఇంటింటికీ వచ్చి జగనన్నా.. మా నమ్మకం నువ్వే అంటూ స్టిక్కర్లు వేస్తారంట. అలా వస్తే జనం బుద్ధిచెప్పాలి. ఇష్టం వచ్చినట్లు పరిపాలించడానికి రాష్ట్రం జగన్‌ అబ్బ సొత్తు కాదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related Articles