అమూల్‌ జగన్‌రెడ్డికి యముడిలా కనిపిస్తున్నా

‘యువగళం దెబ్బకు 420 జగన్‌ రెడ్డికి జ్వరం వచ్చింది. జగన్‌రెడ్డి పిరికివాడు కాబట్టే ఖాకీలను అడ్డుపెట్టుకుని నా పాదయాత్రను అడ్డుకుంటున్నాడు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాదయాత్ర చేస్తున్నా. అమూల్‌ జగన్‌రెడ్డికి నేను యముడి లా కనిపిస్తున్నా’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవా చేశారు. 22వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు మొదటివారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామన్నాడు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు. ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడాడు. ఎక్కడికి పోతే అక్కడే రాజధాని అంటాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీలో 2019లో 20వేల ఉద్యోగాలని శంకుస్థాపన చేశాడు. మళ్లీ మొన్న శంకుస్థాపన చేసి 6వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. గజినీ కదా అన్నీ మర్చిపోయాడు. బూంబూం, ప్రెసిడెంట్‌ మెడల్‌ వంటి జే బ్రాండ్ల మద్యం తీసుకొచ్చి, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాడు. ఇంటిపన్ను నుంచి చెత్తపన్ను వరకు అన్నీ పెంచుకుంటూ పోతున్నాడు. అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది. పబ్లిసిటీ పీక్‌… అసలు విషయం వీక్‌. సత్యవేడు పాదయాత్రలో డిక్సన్‌ కంపెనీ బస్సు ఎక్కి ఆ ఉద్యోగులతో సెల్ఫీ దిగాను. ఏపీలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా? దానిముందు సెల్ఫీ తీసుకోగలవా?’ అని సీఎం జగన్‌పై లోకేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

Related Articles