కేసీఆర్ పాపాల భైరవుడని, ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలిసే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లాలో బుధవారం సాగింది. రాత్రి మొగుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఉదయం చిట్యాలలో మహిళా సమ్మేళనంలో, కోటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్తో వామపక్షాలు పొత్తు పెట్టుకుంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలను కమ్యూనిస్టులు తమ నెత్తిన వేసుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తెలిపారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుటుంబానికి, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇవ్వమని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందని ప్రశ్నించారు. ‘ఉద్యమానికి ముందు రబ్బరు చెప్పులతో తిరిగిన మీకు హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాల భూములు, ఫాం హౌస్లు ఎలా వచ్చాయి’అని కేసీఆర్ను ప్రశ్నించారు. హైదరాబాద్లో చిన్న పిల్లాడిని కుక్కలు కరిచి చంపితే సారీ చెప్పి తప్పించుకోవాలని కేటీఆర్ చూస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించాలనే సోయి కూడా ఆయనకు లేదన్నారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని హైదరాబాద్ మేయర్ వ్యాఖ్యానించడం.. ఆ పార్టీ నేతల ఆలోచనలకు నిదర్శనమని అన్నారు. ఫార్ములా వన్ కారు రేసులపై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు.
Related Articles
ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
- February 10, 2024
రేపటి నుంచి ప్రజాదర్బార్..
- December 7, 2023
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం
- December 7, 2023
రేవంత్ రాజకీయ ప్రస్థానం
- December 5, 2023
రేవంత్ రెడ్డి ట్రెండింగ్
- December 5, 2023
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- December 5, 2023
లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్
- February 27, 2023